ముక్త : తెలంగాణా ఉమెన్స్ కలెక్టివ్ మేనిఫెస్టో -2014
· తెలంగాణా కోసం ,నూతన సమాజం కోసం కలగంటూ నేలకొరిగిన అమరవీరులకు నివాళిగా
మెమోరియల్ పార్క్ తో పాటుగా ఒక 'తెలంగాణా కల్చర్ సెంటర్ ' నిర్మించాలె . గ్రామీణ ,పట్టణ ప్రాంత మేధావులు ,రచయితలూ,కళాకారులూ ,కవులూ ,ఉద్యమకారులు కలిసి చర్చలు
నిర్వహించుకునేటందుకు ఈ సెంటర్ లో ఉచితంగా హాల్ లాంటి సౌకర్యాలను కల్పించాలె .
ప్రగతిశీల ఆలోచనలకూ ఆచరణలకు దారులు వేయాలె .
· అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలె . ఉద్యమ సందర్భం లో విద్యార్థులపై
పెట్టిన కేసులను ఎత్తివేయాలె
· 2014 సంవత్సరాన్ని తెలంగాణా మహిళా సంవత్సరంగా ప్రకటించుకోవాలె.
· రాజకీయ పార్టీలతో సంభందం లేని మేధావులతో కూడిన 'రాష్ట్ర ప్రణాళిక సంఘాన్ని ' నియమించాలె . అందులో 50% మహిళా మేధావులకు భాగస్వామ్యం ఉండాలె . తెలంగాణా రాష్ట్ర నిర్మాణానికి,అభివృధికి కావలిసిన ప్రణాళికలు రచించడం లో 'స్థానికత' తాత్విక భూమిక కావాలె. . ఉమ్మడి రాజధాని గా హైదరాబాదు 3 ఏళ్లకు మించకూడదు .
· తెలంగాణా లో ప్రస్తుతం ఉన్న సీమాంద్ర ఉద్యోగులకు 2 ఏండ్ల సమయం లో బదిలీ చేయించుకొని తమ సొంత రాష్ట్రానికి వెళ్ళడానికి లేదంటే ఇక్కడే ఉండదల్చుకుంటే తమ పెన్షన్లను
వదిలేసుకోవడానికి అవకాశం ఇవ్వాలె .
· 2 సం ల లోపలనే రెండు రాష్ట్రాలకు 2 హై కోర్టులు ఏర్పర్చాలె.
· ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసీ కౌన్సిల్ లకు స్వయం నిర్ణయాధికారాన్ని ఇవ్వాలె
· మహిళల శరీరాలపై జీవితాలపై పై జరుగుతున్న హింసను అడ్డుకోవాలె. వెంటనే తెలంగాణా మహిళా కమీషన్ ప్రకటించాలె. ఎక్సైజ్ ,విద్య ,మీడియా వంటి రంగాల్లో తెలంగాణా మహిళా కమీషన్ కి,ఆయా శాఖల ప్రణాళికలలో సంపూర్ణ నిర్ణయాధికారాన్ని ఇవ్వాలె . జిల్లా మహిళా
కమిటీలు కమీషన్ తో సమన్వయం చేసుకుంటూ ఆయా రంగాల్లో ప్రణాలికల అమలుకు
పనిచేయాలె.
· మహిళా పంచాయితీలను ప్రోత్సహించాలె. కుల వర్గ ప్రాంత అసమనతల్లో మగ్గుతున్న స్త్రీలకు ఈ పంచాయితీలు 'కౌన్సిలింగ్ ' సెంటర్స్ గ ఉపయోగపడాలె.
· స్త్రీల ఉన్నత విద్యావకాశాలు మెరుగుపర్చడం కోసం తక్షణ ప్రణాళికలు యుద్ద ప్రాతిపదికన
ప్రారంభించాలె. వెంటనే 2 మహిళా యునివెర్సిటిలను నెలకొల్పాలె . వక్ఫ్ భూములను వెనక్కి తీసుకొని ఓల్డ్ సిటి లో ఒక సెంట్రల్ 'మహిళా విశ్వ విద్యాలయాన్ని
ఏర్పాటు చేయాలె.ఒక స్టేట్ మహిళా యునివెర్సిటీ ని మహబూబ్ నగర్ జిల్లాలో నెలకొల్పాలె .
జిల్లాల వారిగా మానవ ,సామజిక శాస్త్రాల్లో ఉన్నత విద్యా మండళ్లను ఏర్పాటు చేయాలె .వాటిల్లో ఉమెన్ స్టడీస్ విభాగాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలె.
· ప్రైవేటు బళ్ళను నిషేదించి ,ప్రభుత్వ బళ్ళను పటిష్థం చేయాలె . అంగన్వాడి టీచర్లకు మాంటిసోరి
శిక్షణా,2 షిఫ్ట్ లలో బాలల కేంద్రాలు ఏర్పాటు చేయాలె. భాషా శిక్షణా కేంద్రాలను బడులకు
అనుసంధానం చేయాలె ,గ్రామీణ యువత,విద్యార్థులు ,మహిళలకు భాషల్లో ఉచిత శిక్షణ
ఏర్పాటు చెయ్యాలె .
· ప్రైమరి స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు/ఉర్దూ భాషల ను 'ఫస్ట్ లాంగ్వేజెస్ ' గా తప్పనిసరి చేయాలె .
· పాఠ్యాంశాలలో స్థానిక జ్ఞానాలకు,చరిత్రకూ ,కళలకు ,భాషా ప్రయోగాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలె. కొఠారి కమిషన్ ఇచ్చిన సూచనల ప్రకారం ,స్థానిక వృత్తి నైపుణ్యాలను ప్రైమరీ స్థాయి నుంచే కర్రికులమ్ లో భాగం చేయాలె.
· ప్రతి జిల్లాలో పిల్లల గ్రంధాలయం ,కల్చర్ సెంటర్ విభాగం తప్పని సరిగా ఏర్పాటు చేయాలె .
గ్రామీణ కళలకు పూర్తి ప్రోత్సాహం అందిచ్చాలె నాటక ,సినిమా రంగాలను ప్రోత్సహించే 'థియేటర్ ,ఫిలిం ఇన్స్టిట్యూట్ ' లను వెంటనే నెలకొల్పాలె. స్థానిక చిత్రకారుల ప్రసిద్ధ చిత్రాలను ప్రదర్శించే
ఆర్ట్ మ్యూజియం ఏర్పాటు చేయాలె .
· చిన్న, గ్రామీణ పరిశ్రమల నైపుణ్యాలను నేర్పే శిక్షణా సంస్థలను ఉన్నత విద్యకు అనుసంధానం
చేయాలె.
· చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలె. అందుకోసం ప్రత్యేక కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలె.
· ఉద్యోగినులకు రవాణా సౌకర్యాలను కల్పించే భాద్యతను అన్ని ప్రభుత్వ ,ప్రభుత్వేతర సంస్థలకు
తప్పనిసరి చేయాలె .
· ప్రకృతి పరిరక్షణ ప్రణాళికల్లో స్త్రీల భాగస్వామ్యం ఉండాలె . గుట్టల పై పూర్తి హక్కు గ్రామ
పంచాయితిలకు ఉండాలె. గ్రానైట్ ఎగుమతిని నిషేదించాలె . ఏ ఊరి రాయి ఆ ఊరికే అన్న
నిభందన పెట్టాలె. చెట్లను నరకడాన్ని తీవ్రంగా పరిగణించాలె .
· చెరువుల పరిరక్షణ ,చిన్న నీటి పారుదల ప్రాజెక్టుల,రక్షిత మంచినీటి పథకాలపై పై అజమాయిషీ మహిళా పంచాయితిలకు ఉండాలె. నల్గొండలో ఈ పథకాలను వెంటనే అమలుచేయాలె .
· ఊరికొక లేడీ డాక్టర్ నీ ,అన్ని ఆధునిక సౌకర్యాలున్న ఉచిత 'బర్తింగ్ సెంటర్ ' ను ఏర్పాటు
చేయాలె.
· ముల్కీ పరిశ్రమలను ప్రోత్సహించాలె . అందుకోసం పూర్వ నిజాం రాష్ట్రంలో చేసిన చట్టాలను
పునరధ్యయనం చేయాలె .
· వ్యవసాయం,నేత పరిశ్రమలకు పూర్తి ప్రోత్సాహం ఇవ్వాలె . మార్కెటింగ్ సౌకర్యాలు , రాయితీలు వెంటనే ప్రకటించాలె .
· స్థానిక విత్తన బ్యాంకులను నెలకొల్పాలె. స్థానిక విత్తన పరిశోధన లను ప్రోత్సహించాలె. విత్తనాలపై ప్రైవేటు కంపెనీల జోక్యాన్ని రద్దు చేయాలె . విత్తన ఉత్పత్తి కేంద్రాల అజమాయిషీ స్త్రీ సంఘాలకు అప్పగించాలె.
· విద్యుత్ ఉత్పత్తి లో తెలంగాణా కి పూర్తీ రాయితీలు ఇవ్వాలె సౌర విద్యుత్ ప్రణాళికలను ప్రోత్సహించాలె .
· ఇంతవరకు నీటి వాటాలో తెలంగాణా నష్టపోయిన దానికి పరిహారం ప్రకటించాలె . పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆపేసి ప్రత్యామ్నాయ పద్దతుల గురించి అన్వేషించాలె . ముంపు గ్రామాలపై
వచ్చిన ఆర్డినెన్సు ను ఉపసంహరించుకోవాలె .
· పాలనా వ్యవస్థల్లో అన్ని స్థాయిల్లో (దామాషా ప్రకారం) స్త్రీల భాగస్వామ్యాన్ని 50% వరకు పెంచాలె .